డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన చిన్నారిపై.. డ్యాన్స్ మాష్టర్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జల్లా భీమరవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భీమవరం టూటౌన్‌ జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ భారతి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న బాలిక.. సైదు చైతన్య వర్మ అనే వ్యక్తి వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి చేరింది. 

 డ్యాన్స్‌ సరిగా చేయడం లేదని ఇంకా బాగా నేర్పుతానని ఓ బాలికను స్కూల్లోని వాష్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

బాలిక కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పొరుగు మండలంలోని ఓ గ్రామానికి చెం దిన పలువురు బుధవారం భీమవరంలో శ్రీ భారతి స్కూల్‌ ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలను మూసివేయాలని, యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్దెత్తున నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.