షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దిశ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా  ఆ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

కాగా... ఎన్ కౌంటర్ కి మద్దతుగా జగన్ చేసిన కామెంట్స్ పై దళిత నేతలు మండిపడుతున్నారు. ఎన్‌కౌంటర్లను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్ధించడం దుర్మార్గమని ఆల్‌ ఇండియా దళిత్‌ రైట్స్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు కందుల ఆనందరావు విమర్శించారు. 

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంపై జగన్‌కు నమ్మకం లేదన్నారు. దళిత మహిళ హత్యాచారం ఘటనపై..నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఒక రెడ్డిగా మాట్లాడటం అన్యాయమన్నారు. జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించాలని కందుల ఆనందరావు విజ్ఞప్తి చేశారు.

కాగా.. సోమవారం అసెంబ్లీ దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై జగన్ స్పందించారు. . దిశ విషయంలో జరిగిన సంఘటనలో తెలంగాణ పోలీసులను మెచ్చుకుంటూ వారికి హాట్సాఫ్ చెప్తున్నానని, అసలు దమ్మున్న వాళ్ళు ఇలా చేసినప్పుడు అభినందించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఉన్న మిగతా ఏపీ శాసన సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

అలాగే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులపై  ఢిల్లీ నుండి వచ్చిన మానవహక్కుల సంఘం చేస్తున్న విచారణ సరికాదంటూ ఇలాంటివి సమాజంలోని ప్రజల్లో వ్యవస్థల పట్ల అపనమ్మకాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.