ఒంగోలు: మాజీ మంత్రి, బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెసులో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దగ్గుబాటి కుమారుడు హితేశ్‌ చెంచురామ్‌ కూడా వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

చెంచురామ్ ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి వైసిపి తరఫున పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి దగ్గుబాటి, వైసీపీ అధినేత జగన్‌ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. 

పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి అభిమానులు వైసీపీ ఫ్లెక్సీలపై దగ్గుబాటి, ఆయన కుమారుడి ఫొటోలు ఉంచి సోషల్‌ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు. అయితే, దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం బిజెపిలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
 
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. టీడీపీని వీడి 2004లో భార్యతోపాటు కాంగ్రెస్ లో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. పురందేశ్వరి బాపట్ల, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాల నుంచి విజయం సాధించి యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల నుంచి దగ్గుబాటి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
 
ఆ తర్వాత పురందేశ్వరి బీజేపీలో చేరి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంగా దగ్గుబాటిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.