Asianet News TeluguAsianet News Telugu

దగ్గుబాటి టికెట్ 175 సీట్లలో జగన్ కొంప ముంచుతుందా?

రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధీశ్వరిలు ఈ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే పురంధీశ్వరి తనయుడు వ్యవహారంతో ఇరకాటంలో పడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు వైసీపీ కొంప ముంచేలా ఉందని ప్రచారం జరుగుతోంది. 
 

Daggubati entry may affect YSR Congress statewide
Author
Amaravathi, First Published Feb 1, 2019, 5:17 PM IST

అమరావతి: తల్లి ఒక పార్టీ. తనయుడు మరో పార్టీ. అందులో ఒకటి జాతీయ పార్టీ అయితే మరోకటి ప్రాంతీయ పార్టీ. ఇది దగ్గుబాటి పురంధీశ్వరి కుటుంబ రాజకీయం. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ లో జోరుగా చర్చ జరుగుతోంది. 

రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధీశ్వరిలు ఈ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే పురంధీశ్వరి తనయుడు వ్యవహారంతో ఇరకాటంలో పడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు వైసీపీ కొంప ముంచేలా ఉందని ప్రచారం జరుగుతోంది. 

దగ్గుబాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒక్క నియోజకవర్గానికే ఉపయోగం. అది ప్రకాశం జిల్లా పర్చూరు. కానీ తల్లి ఒక పార్టీ తనయుడు ఈపార్టీలో ఉండటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ప్రచారం జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని భుజాన ఎత్తుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న భావన ఏపీ ప్రజల్లో ఉంది. యువభేరీ, వంచనపై గర్జన దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలతో వైఎస్ జగన్ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ, బీజేపీలు ఒక్కటేనని మోదీ చెప్పినట్లే వైఎస్ జగన్ పయనిస్తున్నాడని టీడీపీ ఆరోపిస్తోంది. 

మోదీకి దత్తపుత్రుడు వైఎస్ జగన్ అని చంద్రబాబు అంటుంటే, జగన్ మోదీ రెడ్డి అని ఏకంగా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. జగన్ ఆస్తుల కేసు ముందుకు వెళ్లకపోవడానికి వైఎస్ జగన్ కి బీజేపీకి మద్య ఉన్న ఒప్పందమే కారణమంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. నిజమేనా అన్నంతగా చర్చకూడా  జరుగుతుంది. 

ఆ అపవాదును తప్పించుకునేందుకు వైఎస్  జగన్ అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటి పురంధీశ్వరి తనయుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరడం వల్ల తాము చేసిన ఉద్యమాలకే చెడ్డపేరు వస్తోందని వైసీపీలోని ఒక వర్గం భావిస్తోందట. 

ఇప్పటికే వైసీపీ, బీజేపీ ఒక్కటేనని పదేపదే టీడీపీ ఆరోపిస్తున్న తరుణంలో హితేష్ చెంచురాంను పార్టీలో చేర్చుకోవడం వల్ల దాన్ని నిజం చేసినవాళ్లం అవుతామన్న వాదన వినిపిస్తోంది. దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరితో వారి కుటుంబంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుస్తారు. వైసీపీకి కూడా ఆ ఒక్క నియోజకవర్గంలోనే ప్లస్ అవుతుంది. 

కానీ మిగిలిన 174 స్థానాల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నాలుగున్నరేళ్లు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూ టర్న్ తీసుకుంది. తాము బీజేని వ్యతిరేకిస్తున్నామని చెప్పేందుకు నానా పాట్లు పడుతోంది. బీజేపీని విమర్శించడంతోపాటు ధర్మపోరాట దీక్షలు చేస్తుంది. 

అయినా ప్రజల్లో మాత్రం పూర్తి స్థాయి నమ్మకం రాలేదని ఇదంతా ఎన్నికల కోసం చంద్రబాబు ఎత్తుగడ అంటూ ప్రచారం కూడా జరిగిపోతుంది. అదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. 

నాలుగున్నరేళ్ల మోదీతో కాపురం చేసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ నిందలు బీజేపీపై మోపేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా ఆరోపిస్తున్నారు. 

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చిత్తశుద్ధితో చేసింది ఒక్క వైసీపీ మాత్రమేనని మోదీని విమర్శల దాడితో ఉతికి ఆరేసింది కూడా వైసీపీయేనని పలుమార్లు జగన్ చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి తరుణంలో పురంధీశ్వరి బీజేపీని వీడనంటున్నారు. 

కానీ తనయుడు మాత్రం వైసీపీలో చేరతారు ఈ చేరిక పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో కూడా హితేష్ కు సానుకూలత లేదని వ్యతిరేకత ఉందని కూడా ప్రచారం చేస్తున్నారు. 

పురంధీశ్వరి బీజేపీ వీడితే హితేష్ ను పర్చూరు నుంచి బరిలోకి దించినా పర్లేదు కానీ ఆమె బీజేపీలో ఉండగా హితేష్ ను బరిలోకి దించితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావన వ్యక్తమవుతుంది. 

పురంధీశ్వరి కుటుంబం రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో ఆ ప్రభావం ఏపీపై పడే అవకాశం లేకపోలేదని హితేష్ రాకను ఎలా స్వాగతించాలో ఆలోచించాలని పార్టీలో కొందరు వాపోతున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయని అలాంటి పరిస్థితుల నేపథ్యంలో పురంధీశ్వరి తనయుడు హితేష్ తో లాభం లేదని ప్రచారం జరుగుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios