విశాఖపట్నం: ఏపీ రాజకీయాల్లో అదృష్టవంతుడు ఎవరు అంటే దాడి వీరభద్రరావు అనే చెప్పుకోవాలి. 2014కు ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు అండ్ ఫ్యామిలీ ఎన్నికల అనంతరం వైసీపీకి గుడ్ బై చేప్పేశారు. పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

నాలుగేళ్లపాటు స్థబ్ధుగా ఉన్న దాడి వీరభద్రరావు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావుకు సముచిత స్థానం కల్పించారు వైసీపీ అధినేత వైయస్ జగన్. పార్టీలో చేరిన తర్వాత కీలకమైన పార్టీ పదవి కట్టబెట్టారు.

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంతేకాదు ఆయన తనయుడు రత్నాకరరావును అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకునిగా నియమించారు. ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేని డా.సత్యవతిని నియమించడం ఆమె గెలుపులో దాడి వీరభద్రరావు, ఆయన కుమారు రత్నాకర్ లు చాలా కష్టపడి పనిచేశారని పార్టీ గుర్తించింది. 

అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి గెలుపులో తండ్రీ కొడుకులు కీలక పాత్ర పోషించడంతో వైయస్ జగన్ దాడి వీరభద్రరావుకు ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

వైయస్ జగన్ అప్పగించిన బాధ్యతను దాడి వీరభద్రరావు విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీంతో దాడి వీరభద్రరావుకు మళ్లీ రాజకీయ వైభవం వస్తుందని ఆయన వర్గం ఆశిస్తోంది.