విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు. చంద్రబాబు సర్కార్ లక్ష శాతం ఓటమిపాలవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. 

మంగళవారం మీడియాతో మాట్లాడిన దాడి వీరభద్రరావు ఓడిపోవడం ఖాయమని తెలిసే దేశమంతా తీర్ధయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పిలవని పేరంటానికి చంద్రబాబు నాయుడు వెళ్లడమే కాకుండా తాను ఏదో సాధించేస్తానని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్లి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, తెలుగు ప్రజల పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమన్నారు.