కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమార్తె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... ఆ కామాంధుడికి  న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

 ఇందుకూరుపేట మండలానికి చెందిన చాంద్‌బాషా తన భార్య, ఐదుగురు పిల్లలతో నెల్లూరులోని హరనాథపురంలో కాలువకట్ట ప్రాంతంలో నివాసం ఉండేవాడు.  మద్యానికి బానిసైన చాంద్‌బాషా భార్యను వేధించడంతో ఆమె 2015 సంవత్సరం జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాషా మద్యం సేవించి మైనర్‌ అయిన తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. తరచూ ఆమెపై లైంగికదాడికి పాల్పడేవాడు.

విషయం బాలిక ద్వారా తెలుసుకున్న ఇంటి చుట్టుపక్కల వారు.. ఈ విషయాన్ని అంగన్ వాడీ టీచర్ కి తెలియజేశారు.  ఆమె సదరు బాలికను నెల్లూరు బాలసదన్‌కు తీసుకెళ్లింది. వారి సూచన మేరకు అదే నెల 7వ తేదీన నెల్లూరు 4వ నగర్‌ పోలీసులకు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. కన్నకూతురి పట్ల నీచంగా ప్రవర్తించిన ఆ తండ్రికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.