Asianet News TeluguAsianet News Telugu

Cyclone Michaung : ఏపీ, తమిళనాడుకు తుఫాను ముప్పు.. ఈ జిల్లాల్లో కుండపోతే, మత్స్యకారులు వేటకెళ్లొద్దన్న ఐఎండీ

బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుఫాను కారణంగా ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లొద్దని సూచించింది. 

Cyclone 'Michaung' to Form on Dec 2, Begin Rampage by Dumping Heavy Rain over Tamil Nadu and Andhra pradesh ksp
Author
First Published Nov 30, 2023, 9:06 PM IST

బంగాళాఖాతం.. అది తెచ్చే విపత్తులకు సముచితంగా బే ఆఫ్ సార్రోస్ అని పిలుస్తారు. ఎప్పటిలాగే ఈ డిసెంబర్‌లోనూ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి విజృంభించడానికి సిద్ధంగా వుంది. అదే ‘మైచౌంగ్ ’ వచ్చే 48 గంటల్లో కోస్తాపై విరుచుకుపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ ప్రకారం గురువారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు గుర్తించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని .. వచ్చే 48 గంటల్లో ఈ తుఫాను ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తుందని ఐఎండీ చెప్పింది. 

డిసెంబర్ 2 నాటికి ఇది తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం డిసెంబర్ 4 లేదా 5వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా వస్తుందని .. దీని ప్రభావంతో ఈ నెల 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడబోయే నాలుగో తుఫాన్ ఇదే. హిందూ మహా సముద్రంలో ఇప్పటి వరకు ఆరు తుఫాన్లు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో ఇప్పటికే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత దృష్ట్యా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. 

ఈ తుఫానుకు మయన్మార్ సూచన మేరకు ‘మైచౌంగ్’ అని పేరు పెట్టారు. ఈ తుఫాను ఎంత బలపడుతుంది, ఎక్కడ తీరాన్ని దాటుతుందనే దానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. డిసెంబర్ 3 - 5 తేదీల మధ్య దక్షిణ ఒడిషా - ఉత్తర ఆంధ్ర తీరం మీదుగా ఇది అల్పపీడనంగా మారి తీరాన్ని దాటుతుందని ఐఎండీ అంచనా. డిసెంబర్ 7న మరోసారి బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడి , బలహీనంగా మారి బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని ఐఎండీ పేర్కొంది. 

ఈ తుఫాను భారత ఆగ్నేయ తీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో గురు, శుక్రవారాలు.. కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో శుక్రవారం నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే డిసెంబర్ 1 నుంచి 4 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 65 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

శనివారం నుంచి సోమవారం వరకు కోస్తా తమిళనాడు, కోస్తా ఆంధ్రల్లో 64.5 మి.మీ నుంచి 204.4 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా వుంటుందని, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలకు వరి, తదితర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కోతకు వచ్చిన వరి పంట కోత పనులు మొదలుపెట్టి భద్రపరచుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios