Cyclone Michaung: తిరుమల, తిరుపతిని ముంచెత్తిన భారీ వర్షం.. మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తో అనేక ప్రాంతాలు జలమయం
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరికొన్ని గంటల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతిలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది.
Incessant rains lash Tirupati: మిచాంగ్ తుఫాను కారణంగా తిరుపతి, తిరుమలలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కపిలతీర్థం, మాల్వానీ గుండం జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. జలపాతాలను చూసేందుకు నగర ప్రజలు కపిలతీర్థం వద్దకు తరలివచ్చారు. ఇదే సమయంలో తిరుమల, తిరుపతి అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ సైతం తీవ్రంగా ప్రభావితమైంది. రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
మునిసిపల్ కమిషనర్ డీ.హరిత ఉన్నతాధికారులతో కలిసి పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. 24 గంటలూ పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, అత్యవసరం సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. కోరమామిడిగుంట, పార్వతీపురం, లక్ష్మీపురం, ఎస్పీడీసీఎల్ ప్రాంతాల్లో పర్యటించి నగరంలో డంప్ లను తొలగించేందుకు, మురుగు కాల్వలు మూసుకుపోకుండా ఉండేందుకు అవసరమైతే మరిన్ని సిబ్బంది, వాహనాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు.
డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రగతినగర్, గొల్లవానిగుంట, ఆటోనగర్, లక్ష్మీపురం సర్కిల్, ఆర్ ఆర్ నగర్ లను పరిశీలించి మున్సిపల్ అధికారులు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఘాట్ రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. దట్టమైన పొగమంచు మొత్తం తిరుమల కొండలను చుట్టుముట్టడంతో ఘాట్ రోడ్లు, తిరుమల కొండలపై కూడా దృశ్యమానంగా తక్కువగా ఉంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను ఇంజనీరింగ్, విజిలెన్స్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.