Asianet News TeluguAsianet News Telugu

మాండౌస్ తుఫాను ఎఫెక్ట్: తిరుపతి జిల్లాకు 226 కోట్ల నష్టం

Tirupati: ప్రాథమిక అంచనాల ప్రకారం మాండౌస్ తుఫాను ప్రభావం తిరుపతిలోని 46 గ్రామాలు, ఏడు పట్టణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. 8,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 545.5 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, 105 ఇళ్లు దెబ్బతిన్నాయి. 3,500 ఇళ్లు నీట మునిగాయి. 
 

Cyclone Mandous Effect: 226 crore loss to Tirupati district
Author
First Published Dec 14, 2022, 1:56 AM IST

Cyclone Mandous Effect: మాండౌస్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు జిల్లాల్లో ఇప్ప‌టికీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్య‌మంగా మాండౌస్ తుఫాను ప్ర‌భావం తిరుప‌తి జిల్లాపై అధికంగా ఉంది. ఇక్క‌డ భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం సంభ‌వించింది. ఉద్యానవ‌న పంట‌లు దెబ్బ‌తిన్నాయి. వేలాది ఇండ్లు నీట మునిగాయి. వంద‌ల ఇండ్లు దెబ్బ‌తిన్నాయి. మాండౌస్ తుఫాను కారణంగా తిరుప‌తి జిల్లాలో రూ.226 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నష్టాన్ని అంచనా వేసినట్లు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారిక ప్రకటనలో వెల్లడించారు. 22 మండలాల్లోని 46 గ్రామాలు, ఏడు పట్టణ ప్రాంతాల్లో మాండౌస్ తుఫాను ప్రభావం ఉందని ఆయన తెలిపారు. ఫలితంగా 8,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 545.5 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 105 ఇళ్లు దెబ్బతినగా, 3,500 ఇళ్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. అలాగే, తుఫాను కారణంగా 16 పశువులు, ఏడు గొర్రెలు, మేకలు చనిపోయాయి.

జిల్లా యంత్రాంగం 12 సహాయ శిబిరాల్లో 1,416 మందికి తాత్కాలిక పునరావాసం కల్పించింది. సహాయక చర్యలను చేపట్టేందుకు, 32 మంది సభ్యులతో ఒక NDRF బృందం, 26 మంది సభ్యులతో ఒక SDRF బృందాన్ని నియమించారు. ఆర్ అండ్ బి రోడ్లు 142.19 కిలో మీట‌ర్లు, పంచాయతీ రాజ్ రోడ్లు 147.6 కిలో మీట‌ర్ల మేర దెబ్బతిన్నాయి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి రూ.461.22 లక్షలు, చిన్న నీటిపారుదల శాఖకు రూ.21.30 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం రూ.69.2 లక్షలుగా నష్టపోయింది. అదనంగా, మత్స్య శాఖ నష్టం రూ. 60.7 లక్షలు కాగా, APSPDCL ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.19.78 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఒక వారంలో తుది నివేదికలు సిద్ధం చేయబడతాయ‌ని అధికారులు తెలిపారు. న‌ష్టం విలువ‌లు మ‌రింత పెరిగే అవ‌కాశముంద‌ని కూడా తెలిపారు. నిరుపేదలకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందనీ, నిబంధనల మేరకు తాత్కాలిక సాయం అందజేస్తామన్నారు. 

కాగా, సోమ‌వారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుపతి నగరంలోని పలు రహదారులపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సూళ్లూరుపేట, గూడూరు డివిజన్లతో పోలిస్తే శ్రీకాళహస్తి, తిరుపతి డివిజన్లపై వర్షాల ప్రభావం ఎక్కువగా పడింది. పెట్రోల్ బంక్‌లు, ఇతర ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రధాన రహదారులు చాలా సేపు నిర్మానుష్యంగా మారాయి. వరుసగా నాలుగో రోజు కూడా జనజీవనం స్తంభించిపోవడంతో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పంటలు, ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం మంజూరు చేయడంలో మానవత్వంతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు వస్తున్నాయనీ, వాటిని పర్యవేక్షిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios