బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాపై తుఫాను పెను ప్రభావం చూపింది. గురువారం రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఫణి అల్లకల్లోలం సృష్టించింది.

ప్రచండగాలులు.. ముంచెత్తే భారీ వర్షాలు తీర ప్రాంతాలను గజగజలాడించాయి. దీంతో ఏ చెట్టు కూలుతుందో.. ఏ ఇల్లు పడిపోతుందోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఈదురుగాలుల తీవ్రత గంటగంటకు పెరగడంతో.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరం దాటి ఒడిషా తీరం వైపు ఫణి వేగంగా పయనిస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ బలం పుంజుకుంటోంది. గురువారం రాత్రికి విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పూరీకి దక్షిణ నైరుతి దిశగా 275 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.

శుక్రవారం ఉదయం 10- 11 గంటల మధ్య ఒడిశాలోని పూరీ, బలుగోడు వద్ద ఫణి తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పెను తుఫాను తీరాన్ని దాటాకా ఈశాన్య దిశగా పయనిస్తూ.. తీవ్ర తుఫానుగా బలహీనపడి బెంగాల్ ‌తీరంలోకి ప్రవేశించనుంది.

అక్కడి నుంచి క్రమంగా బలహీనపడుతూ బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. మరోవైపు ఒడిషాలో తుఫాను తీరాన్ని తాకే ప్రాంతం చాలాదూరంగా సమతలంగా ఉన్నందున ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గోపాల్‌పూర్ రాడార్ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.

రాత్రి కురిసిన భారీ వర్షాలకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో మామిడి, అరటి, జీడీ మామిడి, కొబ్బరి తోటలకు భారీ నష్టం కలిగింది. తుఫాను దృష్ట్యా కాకినాడ ఓడరేవులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఒడిశాలో భారీ వర్షాలు కురిస్తే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదులకు వరద ముప్పు పొంచి వుంది. దీంతో వరద నీటిని దిగువకు వదిలేందుకు గొట్టా బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి ఉంచారు.

అలాగే గాలుల తీవ్రత దృష్ట్యా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు పోలీసులు రాకపోకలను నిషేధించారు.