Asianet News TeluguAsianet News Telugu

రేపు తీరం దాటనున్న ఫణి: రాబోయే 12 గంటలు డేంజర్ అన్న అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను శ్రీకాకుళం జిల్లాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒడిషాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 361 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

cyclone fani latest updates
Author
Visakhapatnam, First Published May 2, 2019, 3:35 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను శ్రీకాకుళం జిల్లాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒడిషాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 361 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశగా 191 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్లు సమాచారం. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ ఒడిషా తీరంవైపు దూసుకెళ్తోంది. రేపు ఉదయం 10 గంటలకు పూరీ తీరం వద్ద ఫణి తుఫాను తీరం దాటనుంది.

తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో ఏపీలోని వివిధ బీచ్‌ల వద్దకు పోలీసులు సందర్శకులను అనుమతించడం లేదు. ఫణి ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని, గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని , శ్రీకాకుళం ఉత్తర, తీర ప్రాంత మండలాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.

విజయనగరం తీర ప్రాంతాల్లో గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులలో 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. అలాగే విశాఖ, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 8వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రేపు ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధాన రహదారులను మూసివేస్తామని అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios