నివర్ తుఫాను ప్రభావం తిరుమలపై బాగా పడింది. పాపవినాశం ప్రాంతంలో అత్యధికంగా 31 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. గోగర్భం డ్యాం వద్ద 25 సెంటిమీటర్లు, ఆకాశగంగ వద్ద 18 సెంటీమీటర్లు, కుమారధార పసుపుధార డ్యాంల వద్ద 15.5 సెంటీమీటర్లు, తిరుమలలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీచడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. పాపవినాశనం దారిపై కూలిన వృక్షాలను అటవీ సిబ్బంది తొలగించారు. మరోవైపు తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.