తీవ్ర తుపాన్‌గా మారిన అసని.. తీరం వైపు దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో అసని వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ఈ ప్రభావంతో తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తీవ్ర తుపాన్‌గా మారిన అసని.. తీరం వైపు దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో అసని వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. తీరం దగ్గరకు వచ్చే కొద్ది అసని వేగం తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నేడు ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర-ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక, అసని తుఫాన్ తీరానికి దగ్గరగా వస్తే గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. తీరానికి దూరంగా పయనిస్తే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, అసాని తుఫాన్ ప్రస్తుం కాకినాడకు 330 కి.మీ, విశాఖపట్నంకు 350 కి.మీ, గోపాలపూర్‌కు 510 కి.మీ, పూరీకి 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా అసాని తుఫాన్ రానుంది. ఆ తర్వాత దిశ మార్చుకుని తీరానికి దూరంగా ప్రయాణించనుంది.
ఇక, అసాని తుఫాన్.. తీరంలో అలజడి సృష్టిస్తుంది. అసని తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతం కోతకు గురవుతోంది. తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఏపీలోని పలుచోట్ల సముద్రం ముందుకొచ్చింది. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక, తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలుచోట్ల ద్యుత్ వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది.
రానున్న రెండు రోజులు వర్షాలు..
రానున్న రెండు రోజులు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం..
అసని ప్రభావంతో ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతికి తీరంలోని పలువురు మత్స్యకారుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈదురు గాలుల ప్రభావంతో కాకినాడ పోర్టులో లంగరు వేసిన స్టీల్ బార్జి ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు.
తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రెస్క్యూ, రిలీఫ్ సిబ్బందిని మోహరించినట్టుగా పేర్కొంది. రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పింది. ఇక, కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ICGS వీర, 20 మంది కోస్ట్ గార్డ్ సిబ్బందితో ఐదు డిజాస్టర్ రిలీఫ్ బృందాలను విశాఖపట్నంలో సహాయక సామగ్రితో సిద్ధంగా ఉంచారు.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
తుఫాను ముప్పును దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు 24 గంట్లో ఎప్పుడైనా టోల్ ఫ్రీ నంబర్లు 0891-2590100, 0891-2590102కు కాల్ చేయవచ్చని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు అధికారులు మూడు షిఫ్టుల్లో పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మూడు షిఫ్టుల్లో సిబ్బంది మంగళవారం, బుధవారాల్లో కంట్రోల్ రూమ్‌లో పని చేస్తారని చెప్పారు. రెవెన్యూ, ఎస్‌ఎంఐ, ఆర్‌డబ్ల్యూఎస్, మెడికల్, ఫిషరీస్, ఎలక్ట్రికల్ విభాగాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఆరుగురిని ఒక్కో షిఫ్టులో కంట్రోల్ రూంలో కలెక్టర్ నియమించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక, రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు 8977395609 నెంబరు కేటాయించారు.
విమాన సర్వీసులపై అసని ఎఫెక్ట్..
అసాని కారణంగా ఈదురుగాలులు వీస్తుండడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విశాఖపట్నం రావలసిన పలు విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
తుఫాన్ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. భారీ వర్షం కారణంగా రైలు ట్రాఫిక్, రైల్వే ట్రాక్‌లు ప్రభావితమైతే త్వరగా పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
