కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా పేరుతో సైబర్ కేటుగాళ్ల మేసేజ్‌లు: ఎస్పీకి కలెక్టర్ ఫిర్యాదు
కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేశారు. వాట్సాప్ డీపీగా కలెక్టర్ ఫోటో పెట్టుకొని జిల్లాకు చెందిన అధికారులను డబ్బులు పంపాలని మేసేజ్ పెట్టారు.ఈ విషయమై కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కాకినాడ: కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేరుతో జిల్లా అధికారులకు డబ్బులు కావాలని మేసేజ్ లు పంపారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి రావడంతో ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని డబ్బులు కావాలని పలువురు జిల్లా అధికారులకు సైబర్ నేరగాళ్లు మేసేజ్ లు పెట్టారు. ఈ విషయమై అనుమానం వచ్చిన కొందరు అధికారులు కలెక్టర్ కు విషయం చెప్పారు దీంతో కలెక్టర్ కృతికా శుక్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెంబర్ నుండి సైబర్ నేరగాళ్లు డబ్బులు కావాలని మేసేజ్ లు పెట్టారని పోలీసులు గుర్తించారు.ఈ నెంబర్ ఎవరు ఉపయోగించారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్లు, ఎస్పీల వంటి ఉన్నతాధికారుల పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ పేరుతో తెలంగాణ హైకోర్టులో పనిచేసే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపాలని మేసేజ్ పెట్టారు. రూ. 2 లక్షలు కావాలని అడిగితే సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఆధారంగా హైకోర్టు ఉద్యోగి డబ్బులు పంపారు. ఆ తర్వాత ఈ విషయమై ఆయన సతీష్ చంద్రను ఆరా తీశారు. అయితే ఈ విషయంలో తాను మోసపోయినట్టుగా తెలుసుకున్నాడు. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గతంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ఘటన ఈ ఏడాది జూలై 19న చోటు చేసుకుంది.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పేరుుతో కూడ వాట్సాప్ లో డబ్బులు కావాలని కోరారు సైబర్ నేరగాళ్లు . ఈ విషయాన్ని గుర్తించిన ఓం బిర్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన పేరున సైబర్ నేరగాళ్లు డబ్బులు కోరుతూ మేసేజ్ లు పంపుతున్నారని చెప్పారు. ఇలాంటి మేసేజ్ లకు స్పందించవద్దని కూడా ఆయన కోరారు. ఈ ఘటన ఈ ఏడాది మే 3వ తేదీన జరిగింది.
also read:కొంపముంచిన వాట్సాప్ మెసేజ్.. రూ.21లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్...
కామారెడ్డి జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ను సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్ డేట్ పేరుతో బురిడీ కొట్టించారు. డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ బ్యాంకు ఖాతాలోని రూ.3.50 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఈ ఘటన 2021 డిసెంబర్ 7వ తేదీన జరిగింది.తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు ఈడీ అధికారుల పేరుతో నోటీసులు పంపారు. మంత్రికి ఫోన్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈడీ కార్యాలయంలో గంగుల కమలాకర్ ను సంప్రదించారు. అయితే తాము నోటీసులు జారీ చేయలేదని ఈడీ కార్యాలయం తేల్చి చెప్పింది. సైబర్ నేరగాళ్లు ఈ పని చేశారని మంత్రి గంగుల కమలాకర్ గుర్తించారు.ఈ విషయమై ఈడీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.