ఏపీలో కర్ఫ్యూ పొడగింపునకు జగన్ ఆలోచన: చిత్తూరులో జూన్ 15 వరకు పొడగింపు
ఏపీలో మరో రెండు వారాల పాటు ఏపీలో కర్ఫ్యూ పొడగించే అవకాశాలు ఉన్నాయి. సోమవారంనాడు కరోనాపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.
అమరావతి: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో కరఫ్యూను పొడగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రెండు వారాల పాటు కర్ఫ్యూను కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనాపై సమీక్ష నిర్వహించనున్నారు.
కర్ఫ్యూతో మంచి ఫలితాలు వస్తుండడంతో దాన్ని పొడగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. యధావిధిగా కర్ఫ్యూను కొనసాగించాలా, మరికొన్ని సడలింపులతో కర్ఫ్యూను అమలు చేయాలా అనే విషయంపై ఆలోచన సాగుతోంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఆ విషయంపై సూచనలు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
కాగా, చిత్తూరు జిల్లాలో జూన్ 15వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగించారు. కర్ఫ్యూ సడలింపు సమయాన్ని కూడా తగ్గించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుంది. కర్ణాటక, తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాకపోకలను కట్టడి చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు మంతి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.
థర్డ్ వేవ్ కట్టడికి కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇందుకు గాను చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. థర్డ్ వేవ్ లో పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగతున్న నేపథ్యంలో 8 మందితో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. పిల్లలకు చికిత్స చేసే శిక్షణ కూడా ఇస్తారు. పిల్లలకు కోవిడ్ సోకకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వనుంది.