శ్రీశైలం దేవస్థానంలో నిధుల కుంభకోణంపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది. ఆలయంలో వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.2.56 కోట్ల నిధులు పక్కదారి పట్టించినవారిపై క్రిమినల్ కేసుల నమోదు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.

దేవస్థానం ఏఈవోలు, ఇతర సిబ్బంది 13 మంది, 20 మంది ఆంధ్రా బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. విచారణ పూర్తయ్యే వరకు 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:శ్రీశైలం ఆలయంలో స్కామ్: పోలీసుల చేతికి చిక్కిన 26 మంది నిందితులు

వీరి నుంచి సొమ్ము రికవరీ చేయాల్సిందిగా సూచించింది. కాగా శ్రీశైలం దేవస్థానంలోని రూ.150 టికెట్ల కౌంటర్‌లోనూ, ఆర్జిత సేవల కౌంటర్‌లోనూ భారీ అవినీతి వెలుగుచూసింది.

సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోసుగులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల ద్వారా ఈ రెండు కౌంటర్లలో పనిచేసే ఉద్యోగులు రూ.1.42 కోట్ల విలువైన స్వామి వారి సొమ్మును స్వాహా చేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read:సాఫ్ట్‌వేర్ మార్చి శ్రీశైలం దేవాలయంలో కోట్లు స్వాహా: ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఈవో

శ్రీశైలంలో ఇటీవలే డొనేషన్ కౌంటర్‌లో రూ.60 లక్షల కుంభకోణం జరిగింది. ఈ ఘటన మరవకముందే మరో స్కామ్ జరిగింది. శీఘ్ర దర్శనంలో రూ.కోటి 80 లక్షలు, అభిషేకం టిక్కెట్లలో రూ.50 లక్షలు, భక్తులు ఇచ్చిన విరాళాల్లో రూ.కోటి, యాత్రికుల గదుల్లో రూ.50 లక్షల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఒక్కో అవినీతి బండారం బయటపడుతుంటంతో ఈవోకి పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఉద్యోగులు. దీంతో మొత్తం కుంభకోణం వెలుగు చూసింది.