ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రశ్నల వర్షం కురిపించారు. పార్లమెంట్ లో వైసీపీ తీరు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆమె అన్నారు. శుక్రవారం విశాఖలో ఆమె అధికార పార్టీ నేతలపై విమర్శలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీతో.. సీఎం జగన్ అనైతిక, అప్రజాస్వామ్య పొత్తు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ పొత్తు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను హరిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ పోరాటాలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పార్లమెంట్ లో నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు.

దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తే అమాయ గిరిజనులకు రక్షణగా నిలిచేది ఎవరని ప్రశ్నించారు.  గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఎం పోరాటానికి సిద్ధమౌతోందని చెప్పారు. పుల్వామా ఘటనపై సుప్రీం కోర్టు తీర్పు.. మోదీకి చెంపదెబ్బలాంటిదని ఆమె అన్నారు.