ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు పంపారంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపించారు. 

అయితే వైఎస్ జగన్ కు కేసీఆర్ ఇచ్చింది రూ.1000 కోట్లు కాదని రూ.600 కోట్లు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు డబ్బులు ఖర్చుచేశాయని విమర్శించారు. 

డబ్బులు పంపిణీ చేసి ఎన్నికలు నిర్వహించే బదులు వేలం వేసి నియోజకవర్గాలను కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఎన్నికలను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ఎన్నికలను చూస్తే బాధేసిందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.