అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకై ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూచించారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగాయని... మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కాబట్టి ఏపీలో కూడా స్థానిక ఎన్నికలకు ఈసీ సిద్దమైంది. కాబట్టి కరోనాను సాకుగా చూపి ఈసీ ప్రయత్నాన్ని అడ్డుకోవడం తగదని వైసిపి ప్రభుత్వానికి రామకృష్ణ సూచించారు. 

''ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ఉండగా వైసిపి ఆటలు సాగవనే ఉద్దేశంతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణ ప్రకారం ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థలకే కేంద్రం నిధులు కేటాయింపు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి 2021 ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కు సహకరించాలి'' అని రామకృష్ణ అన్నారు. 

మరోవైపు డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని రామకృష్ణ అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే 1 సెంటు స్థలం ఒక కుటుంబం నివసించేందుకు ఏమాత్రం సరిపోదు కాబట్టి  ఇళ్ల స్థలాలను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. 

''డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళను కేటాయించండి. గత ఎన్నికల సందర్భంగా టిడ్కో ఇళ్ళను ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ మేరకు టిడ్కో ఇళ్ల రుణ బకాయిలను ప్రభుత్వమే చెల్లించి, లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలి. సంక్రాంతిలోగా టిడ్ కో ఇళ్లకు మరమ్మతులు చేపట్టి, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించండి'' అని రామకృష్ణ సూచించారు.