గుంటూరు: శారద పీఠాధిపతి స్వరూపానందస్వామితో భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ చెప్పారు.తాము నాస్తికులం కాదు.. మెటిరియలిస్టులమని ఆయన చెప్పారు.

గురువారం నాడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణంలో తమ పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో శారదపీఠానికి వెళ్లినట్టుగా చెప్పారు. తాను వెళ్లిన సమయంలో ఆయన తనను బాగా రిసీవ్ చేసుకొన్నారన్నారు.

తాను మాట్లాడే మాటలు మీకు నచ్చవు కాదు కదా అని స్వామితో అన్నానని ఆయన చెప్పారు. అయితే తాను చెప్పేవి బాగుంటాయని స్వరూపానంద తనకు చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఆయనతో తాను ఏం మాట్లాడానని ఆయనను అడిగితేనే బాగుంటుందన్నారు.

శారద పీఠాధిపతి స్వరూపానందతో సీపీఐ నారాయణ ఆసక్తికర సంభాషణ also read:

రాష్ట్రంలో నిర్భంధ ఏకగ్రీవాలను తాను తొలిసారిగా చూస్తున్నట్టుగా నారాయణ చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీకి భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మీకే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు నిర్భంధంగా ఏకగ్రీవాలు చేయించుకొంటున్నారని ఆయన అడిగారు.దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆయన కోరారు.

ఢిల్లీలో పాదపూజలు చేసే నేత విశాఖలో పాదయాత్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డిపై నారాయణ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తున్న వైసీపీని ఓడించాలని  ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామన్నారు.భవిష్యత్తులో ఈ స్నేహం కొనసాగే అవకాశం ఉందన్నారు.