ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చిన్న రాష్ట్రం కావాలని ధర్మాన ప్రసాదరావు అనడం అవివేకం అని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్స్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చిన్న రాష్ట్రం కావాలని ధర్మాన ప్రసాదరావు అనడం అవివేకం అని విమర్శించారు. సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు రాష్ట్రాన్ని చీల్చాలని చెబుతున్నారని.. ఆయన మంత్రి పదవికి అనర్హులని అన్నారు. వైసీపీ పీఠం కదిలిపోతుండటం, ప్రజల నుంచి వ్యతిరేక రావడంతో.. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిని ధ్వంసం చేసే కుట్రలో భాగంగానే ధర్మాన ఈ కామెంట్స్ చేశారని ఆరోపించారు.
కందుకూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయడం సరికాదని రామకృష్ణ అన్నారు. సీఎం జగన్ కూడా ఈ విధంగా మాట్లాడటం.. ఆయన స్థాయికి తగదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వల్లే ఈ ఘటన జరిగితే.. ఆయన మీద హత్యానేరం కింద కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. మంత్రి ధర్మాన శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా ఉంచితే విశాఖ కేంద్రంగా తాము చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఉత్తరాంధ్రలో తిరుగుతూ చంద్రబాబు అమరావతే రాజధాని అంటున్నారని మండిపడ్డారు. ‘‘విపక్షనేత మన చేతులతో మన కళ్లను పొడిచేలా మాట్లాడుతున్నారు’’ అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అని.. సైకిల్‌ను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. వైసీపీ సంక్షేమ పాలన చూడలేకే చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నారని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
