విజయవాడ: జీతాలు పెంచమని అడిగితే వాలంటీర్లను ఉద్యోగస్తుల నుంచి సేవకులుగా మారుస్తారా? అని ముఖ్యమంత్రి జగన్ ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున నవరత్న పథకాలు అమలుకు వాలంటీర్లను నియమించి... రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. "మాట తప్పం - మడమ తిప్పం' అన్న సీఎం ఇప్పుడు వాలంటీర్లను సేవకులుగా గుర్తిస్తూ లేఖ రాయటం ఏమనాలి? అని నిలదీశారు. 

'వాలంటీర్లు ప్రజాసేవకులు అయినప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రజాసేవకులే కదా? వారికి నెలకు వేతనాలు, ఖర్చుల రూపంలో లక్షలాది రూపాయలు చెల్లించటం ఎందుకు? ఎమ్మెల్యేలకు కూడా వాలంటీర్లలాగా నెలకు రూ.5 వేలు ఇస్తే సరిపోతుంది కదా!'' అని అన్నారు. 

''రాష్ట్రంలో నియమించబడిన 2.5 లక్షల వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోంది. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లకు వేతనం పెంచి నెలకు రూ. 12 వేలు ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి'' అని రామకృష్ణ డిమాండ్ చేశారు.     

read more   వేతనాలు పెంచాలని వాలంటీర్ల ధర్నా: విజయవాడ కార్పోరేషన్ వద్ద ఉద్రిక్తత

జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు గత సోమవారం ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.  ఇటీవల కాలంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నవారికి తమ కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారని వాలంటీర్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తాము తీసుకెళ్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు. కానీ తమకు సరైన వేతనం అందడం లేదని వాలంటీర్లు చెబుతున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తాము వారధిగా ఉన్నామని.. అలంటి తమకు చాలీచాలని వేతనాలు అందుతున్నాయని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడగని వారికి కూడ వేతనాలు పెంచుతున్న సీఎం జగన్... తాము వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఎందుకు వేతనాలు పెంచడం లేదో చెప్పాలని వాలంటీర్లను ప్రశ్నించారు.