ప్రకాశం: బీజేపీపై సీపీఐ నారాయణ నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నారాయణ బీజేపీ వల్లనే దేశానికి ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన భార్యపై ఎంత ప్రేమ ఉందో రామాలయంపైనా అంతే ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు. 

ఎన్నికలు సమీపిస్తుండటంతోనే మళ్లీ రామాలయ నిర్మాణాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. సీబీఐని ఇస్కో అంటే ఉస్కో అనేలా తయారు చేశారని విమర్శించారు. సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల వ్యవస్థలను మోదీ తన వంటింటి కుందేలు మాదిరిగా తయారు చేశారని ధ్వజమెత్తారు. 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవని అన్నారు. రఫెల్‌  విమానాల స్పీడ్‌ కన్నా మోదీ అవినీతి ఇంకా స్పీడ్‌గా వెళ్తుందని నారాయణ ధ్వజమెత్తారు. 

మరోవైపు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో మిరపకాయలు పండించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో అనేక మార్పులు రాబోతున్నాయని నారాయణ తెలిపారు.