Asianet News TeluguAsianet News Telugu

అధికార పార్టీనే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుంది.. : వైసీపీపై సీపీఐ నారాయణ ఫైర్

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీనే మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆనాడూ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉండగా.. అమరావతి రాజధాని కావాలని ఏకగ్రీవ తీర్మానం వచ్చిందన్నారు.

CPI Narayana Slams YSRCP And PM Modi
Author
First Published Nov 19, 2022, 4:54 PM IST

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీనే మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆనాడూ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉండగా.. అమరావతి రాజధాని కావాలని ఏకగ్రీవ తీర్మానం వచ్చిందన్నారు. ఇప్పుడు మూడు రాజధానులతో ప్రజలను రెచ్చగొట్టడం అవకాశ వాదం కాదా? అని ప్రశ్నించారు. శనివారం నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..  వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారని అంటారని.. అది వైసీపీ చేసే బ్లాక్‌మెయిల్ అని విమర్శించారు. చంద్రబాబు పాలన బాగాలేదనే ప్రజలు వైసీపీని ఎన్నుకున్నారని అన్నారు. వైసీపీ పాలన బాగోలేదని చంద్రబాబు చెబుతున్నారని.. దానికి కౌంటర్ ఇవ్వాలి కానీ.. భౌతిక దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఫిట్‌గా ఉన్నానని చెబుతున్నారని.. రాజకీయాలు ఏమైనా మల్లయుద్దమా అని ప్రశ్నించారు. నాయకులు ఫిట్‌నెస్ కాదని.. రాజకీయ పార్టీలు ఫిట్‌గా ఉన్నాయా? లేదా? అని చూడాల్సిన అవసరం ఉందన్నారు. 

‘‘ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వన్ టూ వన్ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ను పక్క చూపులు చూడొద్దని మోదీ కోరి ఉంటారు. ఏపీలో బీజేపీ బలపడాలంటే టీడీపీ ఉండకూడదు. బీజేపీ గెలవకపోయినా పర్లేదు కానీ వైసీపీ గెలిస్తే చాలని మోదీ భావిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న కొన్ని విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒప్పుకోకపోయినా.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఒప్పుకుంటుంది. అందుకే వైసీపీ గెలిచినా వారికి ఏం సమస్య లేదని అనుకుంటున్నారు. దానికి అనుగుణంగా మోదీ ప్లాన్ చేసి వెళ్లారు’’ అని నారాయణ అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మోదీ ఏపీకి వచ్చారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ, వైసీపీలు ఒకదానిని విడిచి ఒకటి ఉండలేని పరిస్థితి ఉందన్నారు. 


బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులు, సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో కూడా ప్రైవేట్ విమానాలు, ప్రైవేట్ హెలికాప్టర్‌ల ద్వారా డబ్బులు చెరవేస్తున్నారు. ఎన్నికల్లో బ్లాక్ మనీ ఆపాలని మోదీ చెప్పారని.. మరీ ఇప్పుడు ఎన్నికల్లో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. బ్లాక్ మనీపై మోదీ ఏం చెప్పారు? ఏం జరగుతోందని? అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రమాదాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యం ఉండదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios