మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా..? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు సీపీఐ నారాయణ. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ వద్ద పసలేకే పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా..? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా అంటూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్ తన స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాజకీయంగా ఎవరినైనా విమర్శించొచ్చని కానీ వ్యక్తిగత దూషణలు సరికాదని నారాయణ హితవు పలికారు.

ALso Read: పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. నిన్ను ఇకపై 'లోఫర్ నారాయణ' అని పిలుస్తాం : జనసేన తెలంగాణ అధ్యక్షుడి వార్నింగ్

ఇకపోతే.. ఇటీవల పవన్ కళ్యాణ్ పై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని అన్నారు. ఆయన ఒక్క చోట మూడు నిమిషాలు స్థిరంగా నిలబడలేడని విమర్శించారు. ఆయన రాజకీయాలు కూడా అలాగే అస్థిరమైనవని అన్నారు. పవన్ కళ్యాణ్ చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ డ్రెస్ వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత గాడ్సేలా తుపాకీ కూడా పట్టుకుంటాడని తాను సందేహిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఆయన ఒక దళారీ అవతారం ఎత్తారని విమర్శలు సంధించారు.

ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూ అని కేంద్రంలోని బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఎన్డీయే గూటికి చేరుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఫిలాసఫీ ఏమని నిలదీశారు. వామపక్షాలపై అభిమానం అని, చెగువేరా తనకు ఆదర్శనమని పవన్ చెప్పారు. ఆయన లైబ్రరీలోనూ వామపక్షాల పుస్తకాలు ఉన్నాయని వివరించారు. ముందు చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ దుస్తులు ఎలా వేసుకుంటున్నారనే తాను ప్రశ్నిస్తున్నానని నారాయణ అన్నారు. చెగువేరా డ్రెస్ వేసుకున్నాడు కాబట్టే తాను ఈ ప్రశ్న వేస్తున్నట్టు స్పష్టించారు.