బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలను ఓడించాలి : సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్, బీజేపీలను ఓడించాలని సీపీఐ నారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. జీ 20 సమావేశాలను బీజేపీ జాతీయ సమావేశంలాగా కమలం గుర్తు పెట్టుకుని నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీపీఐ నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుపతిలో సీపీఐ బస్సు యాత్ర ముగింపు సభలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌ను కూడా బీజేపీ నేతలు ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, జగన్, బీజేపీలను ఓడించాలని సీపీఐ నారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుమలలో మద్యం తాగ కూడదు.. మద్యం కేసుల్లో నిందితులు టీటీడీ పాలక మండలిలో ఉండవచ్చా అని ప్రశ్నించారు. వీళ్లా టీటీడీ పవిత్రతను కాపాడేది అని నారాయణ నిలదీశారు. తిరుమల దేవుడిని వీరి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు.
ప్రధాని అవినీతిపరుడని.. అందుకే 29 మంది అవినీతి పరులైన దత్త పుత్రులకు కాపాడుతున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అని సమాచారం వస్తోందని.. ఆయనను అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఎందుకంటే రూ. 60 వేల కోట్లు దోచుకుని బెయిల్‌పై ఉన్నవాడు హోల్ సేల్ గా ఉన్నపుడు.. చిన్న చిన్న అభియోగాలు ఉన్న వాళ్లు ఉండకూడదు కదా అని నారాయణ దుయ్యబట్టారు. జీ 20 సమావేశాలను బీజేపీ జాతీయ సమావేశంలాగా కమలం గుర్తు పెట్టుకుని నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ .. 2019 ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచనని జగన్ ఏడు సార్లు పెంచాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి వెళ్లిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాలనలో జగన్ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని.. రాష్ట్రమంతా రహదారులు గుంతలతో నిండాయని ఎద్దేవా చేశారు. రోడ్ల గుంతల్లో మంత్రులను, శాసనసభ్యులను పూడ్చాలని రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇసుక పాలసీ మారుస్తానని దొంగ బిల్లులు వేసి దోచుకొంటున్నారని.. చెత్తపన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా రికార్డు సాధించాడని చురకలంటించారు. 26 జిల్లాల్లో మద్యం అమ్మకాల్లో ప్రతిసీసాపైనా రూ.వంద తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని.. పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటించకూడదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మీటింగ్ లకు వచ్చిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. జగన్ మోడీ కాళ్లు మొక్కుతున్నారని.. రాష్ట్రం రివర్స్ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు.