సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ధ్వజం

పెద్ద నోట్లు రద్దు చేసి ప్రధాని మోదీ దేశంలో ఆర్థిక ఏమర్జెన్సీని విధించారని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు.

మంగళవారం ఆయన తిరుపతిలోని ఎస్‌బీఐ పరిపాలనా భవనం ముందు సీపీఐ కార్యకర్తలతో కలసి ధర్నా చేశారు. పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలన్నారు.

ఆయన్ను ప్రజా కోర్టులో శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందు చూపులేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. దీనిపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్పొరేట్ సంస్థలకు ముందుగానే ఉప్పందించారని, దీంతో వారు జాగ్రత్తలు పడ్డారని పేర్కొన్నారు.

రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ శాడిస్టు అని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని ధ్వజమెత్తారు.