రాజమండ్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు ప్రతిపాదనపై సీపీఐ నేత నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి శాపమై జగన్ ప్రభుత్వాన్ని కూలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేసారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన అన్నారు. 

అమరావతిని రాజధానిగా కొనసాగించని పక్షంలో జగన్ రాజీనామా చేయాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు రాజధానిని మార్చే హక్కు జగన్ కు లేదని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

అమరావతి భూములను సెజ్ లుగా మార్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ, సచివాలయం భార్యాభర్తల సంబంధం వంటిదని, విడదీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం నవ్వుల పాలైందని అన్నారు. 

జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడుతున్నారని, చంద్రబాబుపై కక్షతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఐఎఎస్ అధికారులు కుటుంబాల్లో రాజధానుల పేరుతో గొడవలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్నాడని నారాయణ వ్యాఖ్యానించారు.

విశాఖలో టీడీపీ, వైసీపీ భూమి దొంగలున్నారని, బోస్టన్ కమిటీ నివేదిక మెంటల్ ఆస్పత్రిని తలపిస్తోందని ఆయన అన్నారు. బోగస్ కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు