చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్. దేశంలో దళితులపై దాడులు జరుగుతుంటే 40ఏళ్ళ అనుభవం అంటూ నానా హంగామా చేసే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ విమర్శించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ, తానే సీనియర్ పొలిటీషియన్ అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. దళితుల పేరుతో ఓట్లు పొంది వారు సమస్యల్లో ఉన్నప్పుడు పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. వైసీపీది దళితులపై కపట ప్రేమ అంటూ మండిపడ్డారు.దళితుల దాడులపై బిల్లు తీసుకువచ్చే వరకు తాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.  

మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన ఆమె మోదీ ప్రభుత్వంపైనా సెటైర్లు వేశారు. స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పాస్‌ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా ఇప్పటికీ చట్టం జరుగలేదని విమర్శించారు. పరువు హత్యలపై ఎందుకు చట్టం చేయలేదో కారణం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.