అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ అంబులెన్స్ డ్రైవర్ అత్యాశ, నిర్లక్ష్యం ఓ కోవిడ్ పేషంట్ ను ప్రాణాలు కోల్పోయేలా చేసింది. జిల్లాలోని పెనుగొండ పట్టడానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది.

పెనుగొండ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించినా అక్కడ చికిత్స అందకపోవడం.. క్షణక్షణానికి ఆమె ఆక్సీజన్ లెవెల్స్ పడిపోతుండడంతో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. 

దీనికోసం ఓ ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడుకున్నారు. అయితే ఆ అంబులెన్స్ లో ఆక్సీజన్ సిలిండర్ ఖాళీగా ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టి అంబులెన్స్ డ్రైవర్ ఆమెకు ఆక్సీజన్ అందిస్తున్నట్టుగా నటించాడు. 

దీంతో పెనుగొండ ప్రభుత్వాస్పత్రి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి చేరుకునేలోపు ఆక్సీజన్ అందక అంబులెన్స్ లోనే కోవిడ్ పేషంట్ మృతి చెందింది. 

ఆక్సీజన్ పెట్టినా ఇదెలా జరిగిందని ఆస్పత్రి నర్సు సిలిండర్ చెక్ చేయడంతో డ్రైవర్ బండారం బయటపడింది. తనకు గిరాకీ వస్తుందన్న కక్కుర్తితో ఆ డ్రైవర్ చేసిన పని ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.