Asianet News TeluguAsianet News Telugu

దేశం మొత్తం కరోనా ఆంక్షలు ఎత్తివేస్తే.. తిరుపతిలో మాత్రం ఎందుకు?.. పయ్యావుల కేశవ్..

దేశం మొత్తం కరోనా ఆంక్షలు ఎత్తివేస్తే.. తిరుమల తిరుపతిలో మాత్రం ఆంక్షలు ఎందుకంటూ టీడీపీ నేత పయ్యవుల కేశవ్ ధ్వజమెత్తారు. అందరికీ ఒకే రకమైన దర్శనం, వసతి కల్పించలేని ప్రభుత్వం.. ఒకేరకమైన భోజనం అనడం అవివేకం అంటూ మండిపడ్డారు. 

Covid curbs in Tirumala will be lifted soon, says minister Andhra Pradesh
Author
Hyderabad, First Published Feb 26, 2022, 10:54 AM IST

తిరుపతి : దేశవ్యాప్తంగా covid 19 కేసులు తగ్గుముఖం పట్టాయి. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల Covid curbsను ఎత్తివేశారు. కానీ తిరుపతి-Tirumala మధ్య రాకపోకలపై ఆంక్షలు విధించడంలో ఏం హేతుబద్ధత ఉందో చెప్పాంటూ ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ బుధవారం ప్రశ్నించారు. ఇతర ప్రముఖ ఆలయాలన్నీ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించినప్పుడు తిరుమలలో ఇంకా ఆంక్షలు ఎందుకు కొనసాగుతున్నాయని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ నేత Payyavala Keshav ప్రశ్నించారు.

"వివిధ ఆర్జిత సేవల ధరలను పెంచాలనే TTD ట్రస్ట్ బోర్డు ప్రతిపాదన కారణంగా భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ట్రస్ట్ బోర్డులో పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు నామినేట్ అయినందుకే ఇది జరుగుతోందని.. వారు ఖర్చు-డిమాండ్ డైనమిక్స్ మాత్రమే పట్టించుకుంటారు. భక్తుల గురించి వారికి అక్కర్లేదు" అంటూ ఎద్దేవా చేశారు.

టీటీడీ ప్రైవేట్‌ సంస్థ కాదని, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థ అని, దర్శనం నుంచి ప్రసాదం వరకు అన్నీ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండాలని కేశవ్‌ అనంతపురంలో విలేకరులతో అన్నారు. తిరుమలలోని అన్ని హోటళ్లు, చిరుతిండికేంద్రాలు మూసివేసి, తిరుపతికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం మాత్రమే అందించాలని ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన ధ్వజమెత్తారు. 

"టీటీడీ అందరికీ ఒకే విధమైన దర్శనం, వసతి కల్పించలేనప్పుడు, అందరికీ ఒకే విధమైన ఆహారాన్ని అందించడానికి ఎందుకు ఆసక్తి చూపుతుంది? ఆహారం వ్యక్తిగత ఎంపిక కాబట్టి ఇది ఆచరణాత్మకంగా అమలు చేయలేని నిర్ణయం. దీనివల్ల ఆర్థికపరమైన చిక్కులు భారీగా ఉంటాయి," అన్నారాయన. అంతేకాదు దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం అయిన తిరుపతి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పటికైనా ఈ విషయాలు సరిచేయాలని కోరారు.

దీనికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. దీనిమీద మాట్లాడారు. తిరుమలలో కోవిడ్ ఆంక్షలను దశలవారీగా, జాగ్రత్తగా సడలించాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. "రాష్ట్రంలోని ప్రతి ప్రముఖ దేవాలయం వలె, TTD దేవాలయాలలో అన్ని ఉత్సవాలు త్వరలో పునరుద్ధరించబడతాయి. యాత్రికుల తరలింపుపై ఆంక్షలు వీలైనంత త్వరగా ఎత్తివేయబడతాయి," అని ఆయన తెలిపారు. 

కాగా, తిరుమల వచ్చే భక్తులందరికీ ఒకేరకమైన అన్నప్రసాదం పంపిణీ చేయడానికి టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం మీద పలు విమర్శలు వస్తున్నాయి. తిరుమలలో వసతి, దర్శనం విషయంలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. సామాన్యుడి నుంచి వీఐపీ వరకు ఒకేరకమైన దర్శనం ఉండేలా చర్యలు తీసుకోవాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

తిరుమలలోని హోటళ్లు, చిరుతిండి విక్రయించే దుకాణాలు ఇక ముందు ఉండబోవని టీటీడీ బోర్డు చెప్పడాన్ని తప్పు పడుతున్నారు. ఇది సాధ్యమయ్యే విషయం కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు దీన్ని సమర్థిస్తున్నవారూ లేకపోలేదు. ఈ క్రమంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios