ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తూ మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా వైరస్‌కు మందు కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లోనూ పరిశోధకులు శ్రమిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘‘ కోవాగ్జిన్’’ టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. క్లినికల్ ట్రయిల్స్‌ను వేగవంతం చేసి దీనిని ఆగస్టు 15 కల్లా మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.

దీనిలో భాగంగానే ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రెండు కేంద్రాలతో పాటుగా దేశంలో మొత్తంగా 12 సెంటర్లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది.

Also Read:కరోనా వైరస్‌కు వ్యాక్సిన్:క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతి పొందిన ఇండియన్ కంపెనీ

ఏపీలో విశాఖ కేజీహెచ్‌ను ఎంపిక చేసిన ఐసీఎంఆర్.. వ్యాక్సిన్‌ క్లినికల్ పరీక్షలకు నోడల్ ఆఫీసర్‌గా కేజీహెచ్ డాక్టర్‌ వాసుదేవ్‌ను నియమించింది. అలాగే తెలంగాణలోని క్లినికల్ ట్రయిల్స్‌ నిర్వహించేందుకు నిమ్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.

దీనికి నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని నియమించింది. బెళగావిలోని జీవన్ సఖీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎయిమ్స్ ఢిల్లీ, హైదరాబాద్ బ్రాంచ్‌లతో పాటు గోరఖ్‌పూర్ రానా హాస్పిటల్ తదితర వాటిల్లో క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.