వరదల్లోనే పెళ్లి... పడవలో అత్తారింటికి వధువు..!
వరదల సాకుతో పెళ్లి మాత్రం వాయిదా వేసుకోవాలని వారు అనుకోలేదు. అందుకే.. ఎవరు లేకున్నా.. ఎలాంటి ఏర్పాట్లు లేకున్నా.. వారు పెళ్లి చేసేసుకున్నారు
పెళ్లి అనగానే మనమంతా ఏవేవో ఊహించుకుంటాం. పెళ్లి.. ఎంత గ్రాండ్ గా జరగాలి.. ఎంత మంది అతిథులను పిలవాలి అని.. చాలా లెక్కలు వేసుకుంటాం. అయితే... ఈ దంపతుల విషయంలో మాత్రం అన్నీ రివర్స్ అయిపోయాయి. వారు ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. వారి ఆశలను వరదలు ముంచేశాయి. అయితే.. వరదల సాకుతో పెళ్లి మాత్రం వాయిదా వేసుకోవాలని వారు అనుకోలేదు. అందుకే.. ఎవరు లేకున్నా.. ఎలాంటి ఏర్పాట్లు లేకున్నా.. వారు పెళ్లి చేసేసుకున్నారు. ఈ సంఘటన కాకినాడలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరదల కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ఓ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. రెండు కుటుంబాలు మొదట ఆగస్టులో పెళ్లిని ఫిక్స్ చేశాయి. కానీ, తర్వాత ఎప్పటిలాగే ఆగస్టులో గోదావరి వరదలు వస్తాయని భయపడి పెళ్లి తేదీని జూలైకి వాయిదా వేశారు.
అయితే, ఈసారి వరదలు ముందుగానే వచ్చాయి. పెద్దలు ధైర్యం చేసి ఎలాగైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెదపట్నలంక గ్రామం నుంచి కోనసీమ జిల్లా కేసనపల్లిలోని పెళ్లికొడుకు ఇంటికి పడవలో పెళ్లికూతురు తీసుకెళ్లారు. గురువారం రాత్రి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.