అద్దెకు ఇళ్లు కావాలంటూ వచ్చారు. మంచివాళ్లుగా నటిస్తూ అందరినీ నమ్మించారు. తర్వాత అదునుచూసుకొని.. ఇంటి యజమానిని హత్య చేసి.. బంగారం తీసుకొని పరారయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూరుబిల్లి రేఖారోహిణి ధవళేశ్వరం క్వారీరోడ్డులో తల్లి వెంకటలక్ష్మితో కలిసి నివాసం ఉంటుంది. అనంతపురానికి చెందిన చెక్కా పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి ఈ నెల పదో తేదీన రోహిణి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. కేవలం రెండు బ్యాగులతో మాత్రమే ఇంట్లోకి దిగారు. టీవీ చూడడానికి తరచూ రోహిణి ఇంట్లోకి వెళుతూ ఉండేవారు. 

శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రోహిణి ఇంట్లోకి వెళ్లి కూరగాయల చాకుతో ఆమెను హత్య చేశారు. ఆమె మెడలోని బంగారపు గొలుసు, ఉంగరం లాక్కు న్నారు. అంతలో ఇంటికి వచ్చిన వెంకటలక్ష్మి (రోహిణి తల్లి)పై చాకుతో దాడి చేసి ఆమె మెడలోని గొలుసు దోచుకున్నారు. వెంకటలక్ష్మి పెనుగులాడుతూ ఇంటి వెనుక గోడ దూకి పెద్దగా కేకలు వేసింది. పవన్‌ కుమార్‌ యాదవ్‌ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు.

కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె హత్యకు గురి కావడంతో మతిస్థిమితం కోల్పోయిన తల్లి వెంకటలక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో డాగ్స్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌తో వివరాలు సేకరించారు.

పోలీసులు అరగంట వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్య చేసిన అనంతరం పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి స్థానిక బ్యారేజ్‌ వద్ద స్నానం చేస్తుండగా ధవళేశ్వరం ఎస్సై గణేష్‌ చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.