కరోనా వైరస్ అందరి జీవితాలను మార్చేసింది. చాలా మంది వైరస్ పేరు చెబితేనే భయంతో వణికిపోతున్నారు. ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది విషయంలో చెడు చేస్తున్న ఈ కరోనా వైరస్... ఒకరి జీవితంలో మాత్రం వెలుగు నింపింది. కరోనా కారణంగా వారికి తమ జీవితంలో అసలైన తోడు దొరికింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్ తేలడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.. పక్క, పక్కనే బెడ్లు.. ఇద్దరికీ వ్యాధి లక్షణాలు కూడా లేకపోవడంతో ధైర్యంగా ఆ మహమ్మారిని జయించారు.

ఆస్పత్రిలో వీరిద్దరి బెడ్స్ పక్కపక్కనే ఉండటంతో.. ముందు మాటలు కలిశాయి. తర్వాత మనసులు కలిశాయి.  అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌. అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అంతేకాదండోయ్ ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే. కరోనా నుంచి కోలుకోవడంతో మళ్లీ టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమకథను తల్లిదండ్రులకు చేరవేశారు.. తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేయమని కోరారు.

కులం తేడాలు కూడా లేకపోవడంతో.. పెద్లలకు పెద్దగా వారి ప్రేమలో అభ్యంతరాలు కనపడలేదు. దీంతో.. వారి పెళ్లికి పెద్దలు వెంటనే ఒకే చెప్పారు.ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి వారం, పదిరోజుల వ్యవధిలోనే ప్రేమకథ నడిచింది.. పెళ్లి కూడా అయ్యింది. ఇప్పుడు వీరి లవ్ స్టార్ స్థానికంగా అందరినీ ఆకట్టుకుంటోంది.