స్నేహం ముసుగులో చేసిన ఆర్థిక మోసాన్ని ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. వారి ఏకైక కుమారుడితో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భీమవరం మండలం యనమదురుకు చెందిన సీడే పరశురాముడు(45), ధన సావిత్రి(30) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. సావిత్రి స్నేహితురాలైన అత్తిలికి చెందిన చోడిశెట్టి హైమావతి అధిక వడ్డీ ఇస్తానని.. పది రోజులకొకసారి డబ్బులు ఇచ్చేస్తానని నమ్మించింది. దీంతో పరశురాముడు దాచుకున్న డబ్బుతోపాటు తన బంధువులు, స్నేహితుల నుంచి సుమారు రూ.25లక్షల వరకు అప్పు ఇప్పించాడు.

హైమావతి వారం కిందట సొమ్ముతో పరారవ్వడంతో ఈ దంపతులు తట్టుకోలేకపోయారు. తమను నమ్మి అప్పు ఇచ్చిన వారు కూడా మోసపోయాంటూ ఆవేదన చెందారు. ఈ క్రమంలో మోసాన్ని తట్టుకోలేక తమ ఏడాదిన్నర కొడుకుకి పురుగుల మందు తాగించి వారు కూడా అదే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

తాము ఎవరినీ మోసం చేయలేదని.. తమకు రావాల్సిన డబ్బులు సదరు హైమావతి వద్ద వసూలు చేసుకొని ఆ డబ్బులు తిరిగి పొందాలని.. తమకు అప్పు ఇచ్చినవారిని ఉద్దేశించి లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.