Asianet News TeluguAsianet News Telugu

దేవుని సేవ ముసుగులో అక్రమ సంపాదన.. శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో వైరల్..!

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలో అభిషేకాలు, సర్వదర్శనాల పేరుతో దోపిడీ వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 

corruption allegations on a srisailam trust board member
Author
First Published Jan 21, 2023, 10:58 AM IST

నంద్యాల జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఆలయంలో అభిషేకాలు, సర్వదర్శనాల పేరుతో దోపిడీ వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దేవుని సేవ ముసుగులో శ్రీశైలం ఆలయ ఆదాయానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఒకరు గండి కొడుతున్నారని ఆరోపణలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించి శ్రీశైలం ధర్మకర్తల మండలిలోని సభ్యురాలి ఆడియో లీక్ అయింది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో మల్లన్న గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా అభిషేకాలు చేయిస్తామని ధర్మకర్తల మండలి సభ్యురాలు చెబుతున్నారు. మరి దీనిపై ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి లడ్డూల తయారీకి ఉద్దేశించిన పదార్థాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దినుసుల కొనుగోలులో జరిగిన అక్రమాల వల్ల శ్రీశైలం దేవస్థానానికి రూ.కోటి నష్టం వాటిల్లిందని ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీకి కాంట్రాక్టర్ సెకండ్ క్వాలిటీ సరఫరా చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్ రేట్ కంటే అధిక ధరకు సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. తమ అంతర్గత విచారణలో ఈ విషయం తెలిసిందని... ఈ విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 

అయితే ఈ ఆరోపణలను హనుమంతు నాయక్, తన్నీరు ధర్మరాజు ఖండించారు. లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాల సరఫరాకు టెండర్లు పిలిచామని.. బిడ్డర్‌ను పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. చక్రపాణి రెడ్డి దినుసుల సరఫరాలో అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటిని పర్యవేక్షించి పనులు చక్కదిద్దాల్సిందిగా ఆలయ విజిలెన్స్‌ కమిటీని ఆదేశించి ఉండేవారని అన్నారు. ఆ వ్యాఖ్యలు చక్రపాణి రెడ్డి వ్యక్తిగతం మాత్రమేనని.. ఆలయ ట్రస్ట్ బోర్డులోని ఇతర సభ్యులకు సంబంధించినవి కావని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios