అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ఓ యువకుడి మృతికి కారణమయ్యింది. సత్తెనపల్లిలో పోలీసులకు భయపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందించారు. యువకుడిపై జరిగిన దాడిని చంద్రబాబు ఖండించారు. 

కరోనా నివారణకై పనిచేస్తున్న పోలీసులు సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు. గౌస్ మృతితో పాటు ఆ తర్వాత సత్తెనపల్లిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌస్ పై జరిగిన పోలీసుల దాడిని చంద్రబాబు ఖండించారు. 

మందుల దుకాణానికి వెళ్లిన గౌస్ పై దాడి గర్హనీయమన్నారు. మృతుడి కుటుంబానికి ఎక్స్  గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలని... ఎంతటి కఠిన సమయంలో అయినా పోలీసులు దురుసుగా వ్యవహరించరాదని చంద్రబాబు సూచించారు. 

 అన్నివర్గాల ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని... పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావంతో వ్యవహరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు సూచించారు.