కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ పాజిటివ్ రోగిని నెగెటివ్ వచ్చిందంటూ ఇంటికి పంపించేశారు. కర్నూలు జిల్లాలోని గోస్పాడు క్వారంటైన్ సెంటర్ నుంచి అతన్ని నంద్యాలలోని తన ఇంటికి పంపించారు. అయితే, ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జీ చేసినట్లు తెలుస్తోంది.

కర్నూలులోని నంద్యాలలో ఓ వ్యక్తి తలుపులు వేసుకుని ఇంట్లో బైఠాయించి బయటకు రానని మొరాయిస్తున్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై  చర్యలు తీసుకుంటే తప్ప తాను బయటకు రాబోనని అతను మొరాయిస్తున్నాడు. 

మార్చి 31వ తేదీన అతను ఢిల్లీ నుంచి వచ్చాడు. స్వయంగా అతను క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాడు, గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో అతనికి మూడు సార్లు పరీక్షలు చేశారు. అయితే, అతనికి నెగెటివ్ వచ్చిందని పంపించారు. కానీ, ఓ వ్యక్తికి బదులు అతన్ని పంపించినట్లు తెలుసుకుని అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది. 

రాష్ట్రంలో 171 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లా మొత్తం 275 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు 209కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం కేసులు నమోదు కాలేదు. చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కొంత వరకు ఈ మూడు జిల్లాలకు ఊరట లభించినట్లే.

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల అత్యధికంగా మంది మరణించగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిదేసి మంది మరణించారు. అఅనంతపుూరం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 51
చిత్తూరు 73
తూర్పు గోదావరి 37
గుంటూరు 209
కడప 55
కృష్ణా 127
కర్నూలు 275
నెల్లూరు 72
ప్రకాశం 53
శ్రీకాకుళం 3
విశాఖపట్నం 22