చైనాలోని వుహాన్ లో ఇరుక్కుపోయిన కర్నూలు జ్యోతి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. దీంతో.. ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఆమె చైనా పర్యటనకు వెళ్లింది. కాగా.. అక్కడ కరోనా వైరస్ సోకడంతో అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది.

ఈ వైరస్ మరింత విజృంభిస్తుందన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చైనాలోని చిక్కుకున్న భారతీయులను స్వదేశం చేర్చేందుకు మొదట రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి.

కానీ.. జ్యోతిని తీసుకొచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు. దీంతో కుంటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే తనకు స్వల్ప జ్వరం మాత్రమే వచ్చిందని.. కరోనా సోకలేదని, తనను వెంటనే భారత్‌కు చేర్చాలని ఆమె సెల్ఫీ వీడియోలో భారత ప్రభుత్వాన్ని కోరింది. అటు ఆమె తల్లిదండ్రులు, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కూడా భారత అధికారులను అభ్యర్థించారు. 

Also Read వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతి: ఢిల్లీకి ఫ్యామిలీ మెంబర్స్...

కాగా.. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వం చొరవతో 119 మంది భారతీయులు స్వదేశానికి చేరారు. వారిలో ఇద్దరు తెలుగువారు ఉండగా.. అందులో కర్నూలుకి చెందిన జ్యోతి కూడా ఉంది. జ్యోతిని ఢిల్లీలో 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షల తర్వాత కర్నూలు జిల్లాలకు పంపనున్నారు. 

టీసీఎల్ కంపెనీలో శిక్షణ నిమిత్తం జ్యోతి చైనాలోని వూహాన్‌కు వెళ్లడం గమనార్హం.అయితే మార్చిలో జ్యోతి పెళ్లి ఉండటంతో అప్పటి వరకు వస్తుందో లేదో అన్న సంశయంలో ఉండగా ఎట్టకేలకు ఆమె ఈరోజు స్వదేశానికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.