అమరావతి: గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో కొత్తగా 15 కోవిడ్ - 19 కేసులు నమోదయ్యాయి. కోయంబేడు ప్రభావమే దానికి కారణం. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో 7 కోయంబేడు ప్రభావంతో నమోదైన కేసులే. 

ఏపీలో గత 24 గంటల్లో  కొత్తగా 52 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 2,282కు చేరుకుంది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 50కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది, కృష్ణా జిల్లాలో 15 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు.

 గత 24 గంటల్లో 9,713 శాంపిల్స్ ను పరీక్షంగా 52 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో 94 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.  మొత్తం యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 705 ఉంది.

గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో ఐదు, కడప జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గడిచిన 24 గంటల్లో 4 కేసులు మాత్రమే నమోదు కావడం ఊరట కలిగించే విషయమే. నెల్లూరు జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 

అత్యధిక కేసుల నమోదైన జిల్లాల్లో 615 కేసులతో ఇంకా కర్నూలు జిల్లా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ 417 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో గత 24 గంటల్లో ఏ విధమైన కేసులు కూడా నమోదు కాలేదు. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది..

అనంతపురం 122
చిత్తూరు 192
తూర్పు గోదావరి 57
గుంటూరు 417
కడప 104
కృష్ణా 382
కర్నూలు 615
నెల్లూరు 157
ప్రకాశం 66
శ్రీకాకుళం 14
విశాఖపట్నం 76
విజయనగరం 8
పశ్చిమ గోదావరి 72