ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు, మొత్తం 722: మృతుల సంఖ్య 20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. తాజాగా ఏపీలో 75 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 722కు చేరుకుంది. మరణాల సంఖ్య 20కి చేరుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో తాజాగా 75 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 722కు చేరుకుంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ మూడు మరణాలను ధ్రువీకరించింది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది మృత్యువాత పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సోమవారం మధ్యాహ్నం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 92 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 610 ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 174 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లా 149 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 25 కేసులు, గుంటూరు జిల్లాలో 20 కేసులు, కడప జిల్లాలో మూడు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు తాజాగా నమోదయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉన్నాయి....
అనంతపురం 33
చిత్తూరు 53
తూర్పు గోదావరి 26
గుంటూరు 149
కడప 40
కృష్ణా 80
కర్నూలు 174
నెల్లూరు 67
ప్రకాశం 44
విశాఖపట్నం 21
పశ్చిమ గోదావరి 35