హైదరాబాద్, ఏలూరుల్లో కరోనా కలకలం... తెలుగు రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
దేశంలో అతి భయంకరమైన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని... పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్తలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాశారు. అన్ని పాఠశాలల్లో జాగ్రత్త చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కరోనా పట్ల పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
read more చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలనే...రెండు సార్లు కుట్ర: బుద్దా వెంకన్న
ఆరోగ్యం సరిగా లేని పిల్లలను స్కూలుకు రాకుండా చూడాలని కోరారు. బహిరంగ ప్రదేశాలకు, ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తిని నిలువరించే చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అందుకోసం రాష్ట్రాలకు ఎలాంటి సాయం కావాలన్నా కేంద్రం చేయడానికి సిద్దంగా వుందని అన్నారు.
ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలు తెలంగాణలో బయటపడ్డాయి. అలాగే మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కొందరు ఈ వైరస్ వల్ల కలిగే అనారోగ్య లక్షణాలను కలిగివున్నారు. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా కేంద్రం జాగ్రత్తగా వుండాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కలిగిన వారికి వెంటనే చికిత్స అందించడంతో పాటు జనావాసాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించింది.
read more తెలంగాణలో పెరుగుతున్న కరోనా అనుమానితులు: కార్పోరేట్ ఆసుపత్రుల సంచలన నిర్ణయం