ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో (kurnool medical college) కరోనా వైరస్ (Coronavirus) కలకలం రేపుతోంది.  మెడికల్ కాలేజ్‌లో నలుగురు హౌస్ సర్జన్‌లతో పాటుగా పలువురు విద్యార్థులకు కరనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదం ఘంటికలు మోగిస్తుంది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోజువారీ కరోనా వైరస్ (Coronavirus) కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో (kurnool medical college) కరోనా కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజ్‌లో 50 మంది వైద్య విద్యార్థులకు, వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11 మంది విద్యార్థులకు, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా సోకిన 11 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. 

మెడికల్ కాలేజ్‌లోని విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఏపీలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,78,964కి చేరినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. తాజాగా 38, 479 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా 1,257 మంది కరోనా నిర్దారణ అయినట్టుగా వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనాతో విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా చోటుచేసుకన్న రెండు మరణాలతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,505కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 140 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,59,685కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.