కారణమిదీ:ఆర్టీసీ బస్సులో కరోనా రోగి ప్రయాణం
కరోనా సోకిన పేషెంట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో ఆ బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
విజయవాడ: కరోనా సోకిన పేషెంట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో ఆ బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన 65 ఏళ్ల మహిళ జ్వరంతో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షిస్తే సీజనల్ జ్వరమేనని వైద్యం చేసి పంపారు.
అయితే జ్వరం తగ్గకపోవడంతో ఈ నెల 6వ తేదీన జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించుకొంది. ఈ నెల 12వ తేదీన ఆమెకు కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా సమాచారం వచ్చింది.
దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేరాలని వైద్యాధికారులు ఆమెకు సూచించారు. దీంతో ఆమెను అంబులెన్స్ లో విజయవాడకు ఈ నెల 13వ తేదీన తరలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బెడ్స్ లేవని హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు ఆమెకు సూచించారు.
also read:ఏపీలో కరోనా మృత్యుఘోష: ఒక్క రోజులో 43 మంది మృతి, 1916 కేసులు
సోమవారం నాడు రాత్రంతా ఆమె ఆసుపత్రి వరండాలోనే పడుకొంది.ఇదే విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిని తీసుకొచ్చేందుకు కొడుకు ప్రైవేట్ వాహనాలను విజయవాడకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ కూడ ముందుకు రాలేదు.
దీంతో ఆ వృద్ధురాలు ఆసుపత్రి నుండి విజయవాడ బస్టాండ్ కు ఆటోలో వచ్చింది. అక్కడి నుండి బస్సులో జగ్గయ్యపేటకు చేరుకొంది. కరోనా రోగి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉండకుండా ఇంటికి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు.
స్థానిక తహాసీల్దార్ ఈ విషయమై వైద్యులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు వైద్య సిబ్బంది రావడంతో కుటుంబసభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల సూచనతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు.