ఆ కరోనా పరికాలతో ఫోటోలకు ఫోజా... సిగ్గుగా లేదా జగన్ గారు: బుద్దా వెంకన్న ఫైర్
అధికారంలో వున్నపుడు చంద్రబాబు ఏర్పాటుచేసిన మెడ్ టెక్ జోన్ పై గతంలో విమర్శలు చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు అక్కడే తయారయిన కరోనా వైద్యపరికరాలతో ఫోటోలకు ఫోజులివ్వడంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సెటైర్లు విసిరారు.
విజయవాడ: కరోనా మహమ్మారి ఏపిలో విజృంభిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఇంకా రాజకీయాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నాడని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుండా ఇంట్లోనే కూర్చుంటున్న జగన్ దృష్టంతా ఎన్నికలపైనే వుందన్నారు. ఇప్పటివరకు వైసిపి ప్రభుత్వం కరోనాపై పోరాటానికి చేసిందేమిటో చెప్పాలని ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు వెంకన్న.
''ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి ఎన్నికలే ముఖ్యం అంటూ తాడేపల్లి ఇంట్లో కూర్చోవడం తప్ప కరోనా కట్టడికి వైఎస్ జగన్ గారు చేసింది ఏంటో చెప్పగలరా ఎంపీ విజచసాయి రెడ్డి గారు. కరోనా పెద్ద విషయం కాదు అని నిర్లక్ష్యంగా వ్యవహరించి, కనీసం మాస్కులు ఇవ్వకుండా డాక్టర్లు కరోనా బారిన పడేలా చేసారు'' అంటూ వైసిసి ప్రభుత్వం, సీఎం జగన్ పై మండిపడ్డారు వెంకన్న.
''దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య పరికరాల తయారీ ఆంధ్రప్రదేశ్ లో జరగాలి అని విశాఖలో చంద్రబాబు గారు మెడ్ టెక్ జోన్ ఏర్పాటు చేసారు. ప్రతిపక్షంలో ఉండగా చిల్లర ఆరోపణలు చేసి మెడ్ టెక్ జోన్ ఏర్పాటుకి అడ్డుపడ్డారు జగన్ గారు'' అని ఆరోపించారు.
''అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి జరిగింది విచారణ చేస్తున్నాం అంటూ హడావిడి చేసారు. ఇప్పుడు అదే మెడ్ టెక్ జోన్ లో తయారైన వైద్య పరికరాలు పట్టుకొని మీడియాకి ఫోజులు ఇవ్వడానికి సిగ్గు అడ్డురాలేదా జగన్ గారు'' అంటూ సోషల్ మీడియా వేదికన ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు బుద్దా వెంకన్న.