తిరుపతి: లాక్ డౌన్ నేపథ్యంలో టీటీడీ భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా  తిరుమలలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. నెల రోజులుగా భక్తులకు స్వామి వారి దర్శనం నిలిపివేశారు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా  మార్చి 20వ తేదీ నుండి తిరుమలలో భక్తులకు  వెంకన్న దర్శనం నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారంగా ఆలయంలో భక్తులకు స్వామి దర్శనం విషయంలో నిర్ణయం తీసుకొంటామని టీటీడీ ప్రకటించింది.

మే 3వ తేదీ వరకు  లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం మేరకు మే 3వ తేదీ వరకు భక్తులకు వెంకన్న దర్శనం లేదని టీటీడీ ప్రకటించింది. అయితే మే 31 వరకు సేవా, దర్శన టిక్కెట్లు పొందినవారికి డబ్బులను తిరిగి ఇస్తామని టీటీడీ ఇటీవలనే ప్రకటించింది. దీంతో మే నెలాఖరు వరకు కూడ భక్తులకు వెంకన్న దర్శనం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

భక్తులకు వెంకన్న దర్శనం నిలిచిపోవడంతో ఇప్పటివరకు టీటీడీ సుమారు రూ.130 కోట్లను కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ప్రతి రోజూ కేవలం హుండీ ద్వారానే టీటీడీకీ రూ.3 కోట్లు వస్తాయి. భక్తుల రాకపోకల ద్వారా ట్రావెల్స్, అద్దె గదులు, హోటల్స్‌  ఇతరత్రా వ్యాపారాల ద్వారా కూడ టీటీడీకి భారీగా ఆదాయం వచ్చేది. అయితే ఈ ఆదాయాన్ని టీటీడీ కోల్పోయింది.

also read:కరోనా: మే 31వరకు సేవా,దర్శన డబ్బులు రీఫండ్, భక్తులకు వెంకన్న దర్శనం లేనట్టేనా?

భక్తులకు దర్శనం అనుమతి లేకున్నా కూడ ప్రతి రోజూ స్వామివారికి ఏకాంత సేవలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. భక్తుల రాకపోకలు లేకపోవడంతో తిరుమలలో జంతువులు దర్శనమిస్తున్నాయి.