కరోనా: మే 31వరకు సేవా,దర్శన డబ్బులు రీఫండ్, భక్తులకు వెంకన్న దర్శనం లేనట్టేనా?
ఈ ఏడాది మే 31 వ తేదీ వరకు సేవా టిక్కెట్లు లేదా దర్శన టిక్కెట్లు పొందిన భక్తులకు ఈ డబ్బులను రీఫండ్ చేస్తామని టీటీడీ ప్రకటించింది.తమ టిక్కెట్ల వివరాలను helpdesk@tirumala.orgకు మెయిల్ చేయాలని టీటీడీ గురువారం నాడు కోరింది. టిక్కెట్టు తో పాటు బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు ఐఎఫ్ఎస్‌సీ నెంబర్ ను కూడ మెయిల్ చేయాలని కూడ కోరింది.
ఈ టిక్కెట్లను పరిశీలించి భక్తుల బ్యాంకు అకౌంట్లకు డబ్బులను సమకూరుస్తామని టీటీడీ తెలిపింది. ఈ మేరకు గురువారం నాడు ప్రకటన విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.
కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల వెంకన్న దర్శనాన్ని భక్తులకు ఈ ఏడాద మార్చి 20వ తేదీ నుండి నిలిపివేసింది. తొలి విడత ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ అమలు చేసింది కేంద్రం. అయితే కరోనా నివారణకు గాను లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించింది కేంద్రం.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: మే 3 వరకు తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేత
దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ వరకు దర్శనాలను నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మే 31 వరకు సేవా టిక్కెట్లు, దర్శన టిక్కెట్ల డబ్బులను తిరిగి ఇస్తామని టీటీడీ ప్రకటించడంతో మే 31 వరకు కూడ భక్తులకు దర్శనం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై టీటీడీ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.అయితే స్వామివారికి ఏకాంత సేవలను కొనసాగించనున్నారు.