విశాఖపట్నం:  కరోనా, లాక్ డౌన్ కష్టాలు దేవాలయాలను వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రముఖ హిందూ దేవాలయంలో ఉద్యోగులను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో వున్న కిందిస్థాయి సిబ్బంది రోడ్డునపడ్డారు. 

ఉత్తరాంధ్రలోని సింహాచలం దేవస్థానంలో 140 మంది కాంట్రాక్ట్ సిబ్బంది అధికారులు తొలగించారు. ఆదాయం బారీగా పడిపోవడంతో దేవాలయ నిర్వహణ కష్టం అవుతున్నదన్న సాకుతో ఉద్యోగులపై  వేటేశారు. అయితే కరోనా సమయంలో సెక్యూరిటీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమను అన్యాయం చేయవద్దు... కష్టకాలంలో ఆదుకోవాలంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

లాక్ డౌన్ విధింపు, ఆ తర్వాత కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో దేశంలోని ప్రార్థనా మందిరాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయాయి.  ఏపీలోని ప్రముఖ దేవాలయం తిరుపతి వెంకన్న, సింహాచలం, శ్రీశైలం వంటి దేవాలయాలతో పాటు మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా దేవాలయం కూడ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఆలయాలు తెలిచిన తర్వాత కూడా భక్తుల రాక లేకపోవడంతో దేవాలయాల ఆర్థిక కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సింహాచలం దేవాలయం నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.